హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె సమస్య పరిష్కారం దిశగా హైకోర్టు కీలక ప్రతిపాదన చేసింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. ఈమేరకు ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని బుధవారం ఉదయం 10గం టల్లోగా చెప్పాలని అడ్వొకేట్ జనరలకు సూచించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పలు పిటిషన్లపై హైకోర్టులో మంగళ వారం విచారణ కొనసాగింది. చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్,జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగరు ఉన్నత న్యాయస్థానం కోరింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్ ఆర్టీసీకి Mana మాత్రమే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 2015లో మరోసారి ప్రభుత్వం జీవో ఇచ్చిందని న్యాయవాది విద్యాసాగర్ తెలపగా.. పరిశీలించిన న్యాయస్థానం ఆ జీవో ఆరునెలల వరకే వర్తిస్తుందని పేర్కొంది. హైకోర్టు చట్టానికి అతీతం కాదని... చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు బస్సుల్లో అధికఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధికఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని.. ఈ విషయంలో ఏ ప్రాతిపదికన హైకోర్టు ఆదేశించగలదని ప్రశ్నించింది. ఈ రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు చేపట్టవద్దన్న ఉత్తర్వులు రేపటి వరకు పొడిగించింది. ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటాం - జెఎసి సమ్మె విషయంలో న్యాయస్థానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉం టామని ఆర్టీసీ కార్మిక సంఘాల జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి Mana స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదాపడిన తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా కోర్టు సూచన మేరకు కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈకమిటీకి కూడా కాలపరిమితి ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీ